Telugu News » తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా?

తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా?

by admin
ap telangana

సకల జనులు ఒక్కటై తెలంగాణ కోసం కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ.. నినదీస్తూ.. అందరూ ఏకమై స్వరాష్ట్ర యుద్ధం సాగించారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. తొమ్మిదేళ్లు దాటి పదో ఏడాదిలోకి అడుగు పెట్టింది. కానీ, అనుకున్న లక్ష్యాలు నెరవేరాయా?.. నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా? అంటే ప్రజల నుంచి మౌనమే సమాధానంగా వస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు.

ap telangana

తెలంగాణ ఏర్పటినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయలేదనే విమర్శలు ఉన్నాయి. దళిత సీఎం హామీ దగ్గర నుంచి మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తీసుకొచ్చిన దళిత బంధు దాకా ఎన్నో హామీల విషయంలో మోసం చేశారని ప్రతిపక్షాలు తరచూ తిట్టిపోస్తున్నాయి. అయినా, కేసీఆర్ తీరు మారకపోగా ప్రజల్ని తన మాటల గారడీతో బుట్టలో వేసుకుని పబ్బం గడుపుతున్నారని అంటున్నారు విపక్ష నేతలు. నీళ్లు, నిధులు, నియామకాల సంగతి చూస్తే.. వేల కోట్లతో కాళేశ్వరం కట్టి ఏం సాధించారు.. కాంట్రాక్ట్ కంపెనీల ఓనర్లను వేలకోట్ల అధిపతులను చేసి.. కమీషన్లు దండుకున్నారని విమర్శిస్తున్నారు. నీళ్లేమో కేసీఆర్ ఫాంహౌస్ కి, నిధులేమో బీఆర్ఎస్ నేతలు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి దక్కాయని ఎద్దేవ చేస్తున్నారు.

లక్షల మంది యువకులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ప్రభుత్వ తీరుతో విసుగుచెంది కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ చావుకు కేసీఆరే కారణం అంటూ సూసైడ్ నోట్స్ కూడా రాసినవారున్నారు. తొమ్మిదేళ్లు కాలయమాపన చేసి.. ఈమధ్యే కొన్ని నోటిఫికేషన్లు వదిలారు. కానీ, రోజులు గడుస్తున్నాయే గానీ, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కనీసం రివ్యూ చేయని కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని విమర్శిస్తున్నారు. పైగా, దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ కార్యక్రమాల మాదిరి హడావుడి చేసిన తీరు ప్రజలకు విసుగు తెప్పించిందని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అంటున్నారు.

రాష్ట్రం ఏర్పాటైతే దళితుడ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్.. తర్వాత దళితులకు మూడు ఎకరాల అంశంపైనా మాట మార్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని కాలయాపన చేస్తూ వస్తున్నారు. వడ్డీ లేని రుణాలు, రైతులకు రుణమాఫీ, ఇలా అనేక హామీల విషయంలో మోసానికి పాల్పడ్డారని విమర్శిస్తున్నారు విపక్ష నేతలు. ఇక భూ సమస్యలు, స్కాములకు లెక్కే లేకుండా పోయిందని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా భూ కొనుగోళ్లు, సెటిల్ మెంట్స్ తో కోట్లకు పడగలెత్తారని ఆరోపిస్తున్నారు. ధరణి పేరుతో రైతులు పడుతున్న అవస్థలను చూస్తూనే ఉన్నామని.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది ఇందుకేనా? రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టింది దీనికోసమేనా? అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు.

ఇక దళిత బంధును రాజకీయంగా వాడుకుంటున్నారే గానీ.. నిజంగా దళితుల అభ్యున్నతికి తోడ్పాటు అందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. ఈ పథకంలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలైతే.. కేంద్ర పథకాలను రాష్ట్రంలోకి రానివ్వకుండా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు. ఆయుష్మాన్ భారత్, ఇళ్ల పథకం ఇలా ఎన్నో పథకాల విషయంలో కొర్రీలు పెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఫైరవుతున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో ఉన్నారని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టి బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలను కోరుతున్నారు.

You may also like

Leave a Comment