ఉత్తర కాశీలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) విజయవంతం అయింది. ఈ క్రమంలో టన్నెల్ (Tunnel) నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మోడీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడారు. సొరంగం నుంచి సురక్షితంగా బయట పడినందుకు ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. సొరంగంలో 17 రోజుల పాటు చూపిన ధైర్యానికి గాను కార్మికులను ప్రధాని మోడీ అభినందించారు.
రెస్క్యూ టీమ్ తమ వద్దకు చేరుకునే వరకు కార్మికులంతా ఒకటిగా కలిసి ఓపికగా ఎదురు చూశారని అన్నారు. తాను రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎం పుష్కర్ సింగ్ ధామీ నుంచి తాను ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నానని చెప్పారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానన్నారు. కేవలం సమాచారం ఎప్పుడూ సమస్యలను పరిష్కరించలేదన్నారు.
అందుకే తాను రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందినప్పటికీ చాలా ఆందోళనగా ఉన్నానని వెల్లడించారు. మరోవైపు టన్నెల్ లో గడిపిన రోజుల గురించి ప్రధాని మోడీకి కార్మికులు ఈ సందర్బంగా వివరించారు. టన్నెల్‌లో చిక్కుకున్నప్పటికీ తాము ఎప్పుడూ జీవితంపై ఆశ కోల్పోలేదన్నారు. తాము ఒక్క క్షణం కూడా బలహీన పడలేదని, ఆందోళన చెందలేదన్నారు.
తాము మొత్తం 41 మంది టన్నెల్‌లో ఉన్నామని, ఈ 17 రోజుల పాటు అంతా కలిసే ఉన్నామన్నారు. అందుకే తాము ఏ మాత్రం భయపడలేదని తెలిపారు. టన్నెల్‌లో తాము ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడుకునే వాళ్లమన్నారు. వాకింగ్, యోగా చేయడం ఇలా అంతా కలిసే చేశామన్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు రెస్క్యూ సిబ్బంది, అధికారులకు కార్మికులు కృతజ్ఞత తెలిపారు.