మిచౌంగ్ తుఫాన్ ( Cyclone Michaung)తీవ్ర రూపం దాల్చుతోంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ (IMD) హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే సోమవారం పబ్లిక్ హాలీడేగా డీఎంకే సర్కార్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
తమిళనాడులోని తిరువల్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరువన్ మలై, విల్లుపురం, కడలూరు,మైలాదాతురై, తంజావూరు, అరియాలూర్, పెంబలూరు, కాళ్లకురిచీ, వెల్లూరు, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాలను తాకే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం…. మైచాంగ్ తుపాను పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్యంగా 210 కి.మీ, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 150 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ దక్షిణ ఆగ్నేయ , మచిలిపట్నం 380 కి.మీ ఆగ్నేయ దిశగా ఉన్నట్టు బులిటెన్ లో తెలిపింది. భారీ వర్షాల కారణంగా వ్యాసర్పాడి -బేసిన్ బ్రిడ్జి వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో సోమవారం చెన్నై సెంట్రల్‌లో 11 ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరోవైపు దక్షిణ ఏపీలో నెల్లూరు-మచిలీ పట్నం వద్ద రేపు మధ్యాహ్నానికి మిచాంగ్ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను, గుడిసెలు, పాత ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.