మిజోరాం (Mizoram)లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM) దూసుకు పోతోంది. ఇప్పటికే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 27 స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. 2017లో ఏర్పడిన ఈ పార్టీ సుమారు ఏడు దశాబ్దాల అనుభవం గల మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మట్టికరిపిస్తోంది. సెక్యులరిజం, మతపరమైన మైనారిటీల రక్షణకు ఈ పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది.
జేడ్పీఎం సునామీలో ఎంఎన్ఎఫ్ నేతలు కొట్టుకుపోతున్నారు. ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగాను జేడ్పీఎం అభ్యర్థి లాల్ తంగా మట్టి కరిపించారు. జేడ్పీఎం అభ్యర్థుల చేతిలో డిప్యూటీ సీఎం టాన్లుయా, పలువురు మంత్రులు ఓడిపోయారు. ఐజ్వల్ పశ్చిమ నియోజకవర్గంలో జేడ్పీఎం అభ్యర్థి లాల్ంగింగ్లోవా చేతిలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి లాల్ రువాకిమా ఘోర పరాజయం పొందారు.
అదే సమయంలో టుయిపుయ్ స్థానంలో జేడ్పీఎం అభ్యర్థి జేజే లాల్పెఖ్లువా చేతిలో 133 ఓట్లతో ఆరోగ్య మంత్రి ఆర్ లాల్తాంగ్లియానా ఓడిపోయారు. ఈ పార్టీని 2017లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఐదేండ్లలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది.
జెడ్పీఎంకు లాల్దుహోమా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆయన సివిల్స్ కు ఎంపికయ్యారు.
1977లో ఐపీఎస్‌గా గోవాలో స్క్వాడ్ లీడర్ గా పని చేశారు. ఆ సమయంలో స్మగ్లర్లెకు చుక్కలు చూపించారు. ఆ తర్వాత 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ని తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.