కరుడు గట్టిన నియంత ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కంటతడి పెట్టారు. జనాభాకు సంబంధించి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.
దేశంలో జనన రేటు పడిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. దయచేసి ఎక్కువ మంది పిల్లలను కనాలని తల్లులకు ఆయన సూచించారు. దీంతో పాటు పిల్లల సంరక్షణ అనేది తల్లుల బాధ్యత అని కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు.
గత కొంత కాలంగా ఉత్తరకొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో తల్లుల కోసం ‘నేషనల్ మదర్స్’సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో జననాల రేటు క్షీణిస్తోందన్నారు.
జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లులతో కలిసి ప్రభుత్వం పని చేయాలని నిర్ణయించిందన్నారు. జననాల రేటు తగ్గిపోతోందని, తల్లులు ఎక్కువ మందిని కనాలని చెబుతూ ఆయన కంట తడి పెట్టారు. దీంతో అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.