– అయోధ్య ఆలయం కొత్త ఫోటోలు వైరల్
– గర్భగుడి నిర్మాణం పూర్తి
– ప్రస్తుతం ఆలయ శిఖరం వద్ద పనులు
– రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం జోరుగా పనులు
– రామ మందిర చరిత్రను తెలిపేలా 5 రోజుల వెబినార్
– ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు అనేక కార్యక్రమాలకు ప్లాన్
– జనవరి 16 నుంచి ప్రాథమిక పూజలు
హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య (Ayodhya). అక్కడి దివ్య భవ్య నవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట త్వరలోనే జరగనుంది. జనవరి 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సమక్షంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 16 నుంచి ప్రాథమిక పూజలు ప్రారంభం అవుతాయి. ఆ రోజున ఆచార్య లక్ష్మీకాంత్ మథురానాథ్ దీక్షిత్ ఆధ్వర్యంలో వేద పండితులు సర్వప్రాయశ్చిత్త హోమం చేయనున్నారు. 17న జలయాత్ర, తీర్థయాత్ర, కలశ పూజ, కలశ యాత్రలు జరుగుతాయి.
18 నుంచి ప్రధాన పూజలు ప్రారంభం అవుతాయి. 19న దేవత పూజ, అన్ని శాఖల వేద పఠనం, అధివాసన పూజ, కుండ పూజ, అగ్ని మథనం, జలాధివాసం ఇతర పూజలు ఉంటాయి. 20న వాస్తు పూజ, 81 కలశాల్లో నింపిన ఔషధ జలాలతో ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ చేయనున్నారు. 21న విగ్రహాలకు జలాభిషేకం చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి 114 కలశాల్లో తీసుకు వచ్చిన పవిత్ర జలాలతో ఈ అభిషేకం ఉంటుంది. అనంతరం మహాపూజ నిర్వహించి విగ్రహాలను నగరంలో ఊరేగించే నగర భ్రమణ కార్యక్రమం జరుపుతారు. తర్వాత వాటిని యజ్ఞ మండపంలోకి తీసుకువస్తారు. అక్కడ శయ్యాధివాస్, తత్వన్యాస్, మహన్యాస్ పూజలు చేస్తారు.
ఇక, ప్రధానమైన దేవ ప్రాణ ప్రతిష్ఠ పూజ 22న మధ్యాహ్నం జరుగుతుంది. అనంతరం మహాపూజ, హారతి, పూర్ణాహుతి ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం అయోధ్య రామ మందిర నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఆలయ శిఖరం వద్ద పనులు జరుగుతున్నాయి. గర్భగుడి నిర్మాణం పూర్తి అయినట్లు కనిపిస్తోంది. ఆలయ పనులకు చెందిన తాజా ఫోటోలను ట్రస్ట్ రిలీజ్ చేసింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం జోరుగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ట్రస్టు రిలీజ్ చేసిన ఫోటోల్లో ఆలయం పూర్తిగా దర్శనం ఇస్తోంది.
రామ మందిరానికి చెందిన మొదటి ఫ్లోర్ పనులు నిర్మాణంలో ఉన్నాయి. గర్భగుడి పూర్తిగా తయారై సిద్ధంగా ఉంది. రామ్ లల్లాకు చెందిన బాలుడి మూర్తులను కూడా తయారు చేశారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వెబినార్ ను నిర్వహిస్తున్నారు. 500 ఏళ్ల నాటి రామాలయ చరిత్రను తెలిపేలా ఇది జరుగుతోంది. హిందూ యూనివర్సిటీతో పాటు అమెరికా విశ్వ హిందూ పరిషత్ సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. శనివారం అయోధ్య రామాలయాన్ని పునర్ నిర్మాణానికి జరిగిన పోరాటంపై భారత పురావస్తు శాఖ రీజనల్ డైరెక్టర్ కేకే మహ్మద్ ప్రసంగం ఉండేలా ప్లాన్ చేశారు. అలాగే, 10న ఆలయ నిర్మాణ చరిత్రపై బీజేపీ ఎంపీ సుధాంశూ త్రివేది మాట్లాడనున్నారు. జనవరి 6న జరిగే మూడో వెబినార్ లో న్యాయ అంశాలపై జ్ఞాన్ వాపీ కేసు న్యాయవాది విష్ణు శంకర్ జైన్, 7న ప్రముఖ రచయిత ఆనంద్ రంగనాథన్ మాట్లాడనున్నారు. చివరి వెబినార్ జనవరి 13న నిర్వహించనుండగా, వక్తల పేర్లను ఇంకా వెల్లడించలేదు.
అయోధ్య రామ మందిర విశేషాలు
మొత్తం వైశాల్యం – 2.7 ఎకరాలు
మొత్తం నిర్మాణ ప్రాంతం – 57,400 చదరపు అడుగులు
ఆలయం మొత్తం పొడవు – 360 అడుగులు
ఆలయం మొత్తం వెడల్పు – 235 అడుగులు
శిఖరంతో సహా ఆలయం మొత్తం ఎత్తు – 161 అడుగులు
మొత్తం అంతస్తుల సంఖ్య – 3
ప్రతీ అంతస్తు ఎత్తు – 20 అడుగులు
మొదటి అంతస్తులో స్తంభాలు – 160
రెండో అంతస్తులో స్తంభాలు – 132
మూడో అంతస్తులో స్తంభాలు – 74
మొత్తం మంటపాల సంఖ్య – 5
ఆలయంలోని మొత్తం ద్వారాలు – 12