ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ( Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని వెల్లడించింది. ఆ అధికరణను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని స్పష్టం చేసింది. రాజ్యాంగ సభ రద్దయిన తర్వాత కూడా ఆర్టికల్ 370 రద్దు నోటిఫికేషన్ జారీ చేసే అధికారం కొనసాగుతుందన్నారు. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కాశ్మీర్‌కు 370(1)(డి)కి వర్తింపజేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. భారత్‌లో విలీనం తర్వాత జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేవలం తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 తీసుకు వచ్చారని చెప్పారు.
యుద్ధ పరిస్థితుల వల్లే ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. 370 అధికరణను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని వెల్లడించారు. హక్కుల విషయంలో జమ్ము కశ్మీర్‌కు ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మిగతా రాష్ట్రాలు, యూటీలతో జమ్ము కశ్మీర్ సమానమేనని వివరించారు. ఆర్టికల్స్ 1, 370 ప్రకారం జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనన్నారు
లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరించనున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అంతకు ముందు జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు విషయంలో ఎలాంటి రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరగలేదని కేంద్రం వెల్లడించింది. భారత్‌లో పలు రాష్ట్రాల విలీనం తర్వాత వాటి సార్వభౌమాధికారం పూర్తిగా దేశంలో అంతర్భాగమైనట్లు వివరించింది. జమ్ము కశ్మీర్‌కు తాత్కాలికంగా యూటీ హోదా కల్పించామని, భవిష్యత్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.