దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. వాటిని భారత యూనియన్ లో కలుపుకోవడానికి నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాదాపు అన్ని సంస్థానాలు బేషరతుగా చేరిపోయాయి. కానీ, కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ ఇందుకు అంగీకరించలేదు. వాటిని యూనియన్ లో విలీనం చేయడానికి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో పట్టుదలగా వ్యవహరించి అన్నీ విలీనం అయ్యేలా చేశారు. అయితే.. కాశ్మీర్ విలీన్ విషయంలో అప్పటి రాజు హరి సింగ్ కొన్ని షరతులు విధించారు. దానికి అనుగుణంగా జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడంపై చర్చలు జరిగాయి.
జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. దీన్ని ఆమోదించడంతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం అయింది. ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రతిపత్తిని కల్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా 1954 మే 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయాల్లో మినహా ఇతర అంశాల్లో జమ్ము కశ్మీర్ లో చట్టాలను అమలు చేయాలంటే పార్లమెంట్ కు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే, భారత రాజ్యాంగంతోపాటు మరో ప్రత్యేక రాజ్యాంగం కూడా అమలవుతుంది. ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం దేశంలోని మిగిలిన ప్రాంతాల వారికి భిన్నంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాల వారు జమ్ము కశ్మీర్ లో ఆస్తులు కొనుగోలు చేయడానికి వీలులేదు. అలాగే, అక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు.
ఆర్టికల్ 370 ప్రకారం 1965 వరకూ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ కాల పరిమితి ఆరేళ్లు. అయితే.. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక ఆర్టికల్ 370పై ఫోకస్ చేసింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రజల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలా, 2019 ఆగస్టు 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లుగా విభజించారు. జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం 2019 అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావి వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రద్దును కొంతమంది స్వాగతించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు కొందరు. ఈ అన్ని కేసులను కలిపి సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై మొత్తం 23 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కాదు, జమ్ము కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంది. అంతేకాదు, జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30 లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది. మరోవైపు, జమ్ము కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని సైతం సమర్థిస్తున్నట్లు స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం.