ప్రముఖ రచయిత్రి అరుందతి రాయ్ (Arundhati Roy) చిక్కుల్లో పడ్డారు. ఆమెకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘దేశ వ్యతిరేక’వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో మితా బెనర్జీ (Mita Banerjee) అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
అరుందతి రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంటర్వ్యూను షేర్ చేశారని బెనర్జీ తెలిపారు. అందులో భారత్‌ను ‘హిందూ ఫాసిస్ట్ సంస్థ’అని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ రీ ట్వీట్ చేశారని తెలిపారు. అందువల్ల ప్రకాష్ రాజ్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
భారతదేశ పౌరురాలిగా అరుందతి రాయ్ పోస్ట్ “దురదృష్టకరం” అని అన్నారు. రాయ్ ఇంటర్వ్యూ ఇచ్చిన పశ్చిమాసియా మీడియా సంస్థకు అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అరుందతి రాయ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ పిటిషన్ పై సోమవారం కోల్‌కతా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా పిటిషనర్ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంబంధాలు ఉన్న వ్యక్తులందరికీ తాజాగా నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం కేసును హైకోర్టు వాయిదా వేసింది.