ఆర్టికల్-370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్ (Pakisthan) కారుకూతలు కూసింది. సుప్రీం కోర్టు తీర్పుకు చట్టపరంగా ఎలాంటి విలువలేదని అక్కసు వెళ్లగక్కింది. 5 అగస్టు 2019న భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, చట్టవిరుద్ధమైన చర్యలను అంతర్జాతీయ చట్టాలు గుర్తించలేదంటూ నోరుపారేసుకుంది.
భారత్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాన్ని అంతర్జాతీయ చట్టాలు గుర్తించబోవని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ వెల్లడించారు. దీన్ని సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు చట్టపరంగా ఎలాంటి విలువ ఉండబోదని తెలిపారు. ఐరాస తీర్మానాల ప్రకారం కశ్మీరీ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉందన్నారు.
ఇస్లామాబాద్‌లో మీడియా సమావేశంలో జలీల్ అబ్బాస్ మాట్లాడుతూ… కశ్మీరి, పాకిస్తాన్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వివాదాస్పద భూభాగంపై ఏక్షపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం భారత్ కు లేదన్నారు. జమ్ము కశ్మీర్ స్టేటస్ పై భారత సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును పాకిస్తాన్ తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు.
భారత్ ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యలకు సుప్రీం కోర్టు న్యాయపరమైన ఆమోదం తెలపడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. జమ్ము కశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదమన్నారు. ఏడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అజెండాలో ఈ విషయం కొనసాగుతోందన్నారు. జమ్ము కశ్మీర్ పై తుది నిర్ణయం సంబంధిత ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా, కశ్మీరీ ప్రజల ఆకాంక్షల మేరకు ఉంటుందన్నారు.