టీఎంసీ (TMC) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ (Derek O’Brien) కు షాక్ తగిలింది. రాజ్య సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై రాజ్యసభలో రచ్చ జరిగింది. సభలో ఓబ్రెయిన్ తీరుపై రాజ్యసభ చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఓబ్రెయిన్ పై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ఆమోదం తెలిపారు. సభలో పదే పదే ఓబ్రెయిన్ నినాదాలు చేశారని, సభా కార్యకలాపాలకు ఓబ్రెయిన్ ఇబ్బంది కలిగించారంటూ చైర్మన్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం పెద్దల సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి సమాధానం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై అమిత్ షా స్పందించాలంటూ ఓబ్రెయిన్ నినాదాలు చేశారు. విపక్షాల అభ్యర్థనను చైర్మెన్ జగదీప్ ధన్ ఖడ్ తోసిపుచ్చారు. దీంతో విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చారు. విపక్ష సభ్యుల తీరుపై చైర్మన్ అసహనానికి గురయ్యారు. ఓబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదని ఈ సందర్బంగా రాజ్యసభ చైర్మన్ అన్నారు. అందువల్ల సభ నుంచి వెళ్లి పోవాలని ఓబ్రెయిన్ ను ధన్ ఖడ్ ఆదేశించారు.
సభా హక్కులను ఓబ్రెయిన్ ఉల్లంఘించినట్టు చైర్మెన్ జగదీప్ పేర్కొన్నారు. విపక్షాల గందరగోళం నడుమ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. కానీ సభ ప్రారంభం అయిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ఇరు సభల్లోనూ ఈ ఘటనపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతోంది.