ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ సముదాయం ఆదివారం ప్రారంభమైంది. గుజరాత్ లోని సూరత్ డైమండ్ బోర్స్ (Surat Diamond Bourse)ను ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని సత్కరించారు. ఈ కేంద్రం అంతర్జాతీయ డైమండ్, జ్యుయెల్లరీ వ్యాపారానికి ఆధునిక కేంద్రంగా పని చేయనుంది.
జ్యువెల్లరీతో పాటు కఠినమైన, పాలిషింగ్ వజ్రాల వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్ సమీపంలోని ఖాజోద్ లో దీన్ని నిర్మించారు. ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 4,500 కార్యాలయాలు ఉన్నాయి.
భవనంలో మొత్తం 130 ఎలివేటర్లు ఉన్నాయి. డైమండ్ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా మొత్తం 65వేల మంది వజ్రాల నిపుణులు ఈ కాంప్లెక్స్ కేంద్రంగా పని చేస్తారని అధికారులు తెలిపారు. సుమారు 35.54 ఎకరాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో ఒక హరిత భవనంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు.
మరోవైపు నూతనంగా నిర్మించిన సూరత్ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ బిల్డింగ్ ను గేట్ వే ఆఫ్ సూరత్ గా చెబుతున్నారు. రద్దీ సమయాల్లో 1200 దేశీయ, 600 మది విదేశీ ప్రయాణికులను ఈ టెర్మినల్ హ్యాండిల్ చేయగలదు. వారణాసి-ఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.