దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ (NIA) దాడులు (Raids) కలకలం రేపాయి. ఇస్లామిక్ స్టేట్ నెట్ వర్క్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. మొత్తం 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని అనుమానితుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీచేశారు.
కర్ణాటకలోనే 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఇక జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒక ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో 8 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మిగతా నిందితుల కోసం ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తోంది.
అరెస్టైన నిందితుల్లో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే ఉగ్రవాది నేతృత్వంలో దేశంలోపెద్ద ఎత్తున పేలుళ్లకు కుట్రలు పన్నారని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ తో పాటు సయ్యద్ సమీర్ ను అధికారులు బళ్లారిలో అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అనాస్ ఇక్బాల్ షేక్ ను ముంబైలో అరెస్టు చేశారు. మహ్మద్ మునీరుద్దీన్, సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజామిల్ అనే వ్యక్తులను బెంగళూరులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ రాధాని ఢిల్లీలో షయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్, జంషెడ్ పూర్ లో మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డూ ను అదుపులోకి తీసుకుంది.