బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (LK Advani), మురళీ మనోహర జోషి (Murli Manohar Joshi)లు రామ మందిర (Ram Mandir) ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు నేతలు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇరువురు నేతలు తమ వయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని పేర్కొంది.
ట్రస్టు ప్రతిపాదనకు ఇరువురు సీనియర్ నేతలు అంగీకరించారని తెలిపింది. ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. జనవరి 22న జరిగే ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. జనవరి 15నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు.
ప్రాణ ప్రతిష్ట పూజా జనవరి 16న ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పూజా జనవరి 22 వరకు కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత అధ్వానీ వయస్సు 96 ఏండ్లు, మురళి మనోహర్ జోషి 90 ఏండ్లు ఉందన్నారు వారి వయస్సు, ఆరోగ్య కారాణాల దృష్ట్యా వారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చని రాయ్ వివరించారు.
ముగ్గురు సభ్యుల కమిటీ మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళుతుందన్నారు. దేవేగౌడను ప్రారంభోత్సవానికి ఆ కమిటీ ఆహ్వానిస్తుందన్నారు. ఆరు దర్శనాల (పురాతన పాఠశాలల) శంకరాచార్యులు, సుమారు 150 మంది సాధువులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకకు 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.