జ్ఞానవాపి మసీదు ( Gyanvapi mosque) కేసులో ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. ఈ కేసులో ముస్లింలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు ( Allahabad High Court) తోపి పుచ్చింది. జ్ఞాన్‌వాపి కేసులో మసీదు స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సివిల్ దావాలను సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది.
మొత్తం ఐదు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో మూడు జ్ఞాన్ వాపి మసీదు కమిటీ మూడు పిటిషన్లు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. మరోవైపు ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ దాఖలైన సివిల్ పిటిషన్లకు అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల విషయంలో గత కొన్నేండ్లుగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య పోరాటం కొనసాగుతోంది. 1991లో జ్ఞానవాపి మసీదులోని వివాదాస్పద ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని, అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతించాలంటూ ఆది విశ్వేశ్వర్ విరాజమాన (దేవుని)పేరిట దావా వేశారు.
అక్కడ మసీదులో ఆలయాన్ని పునరుద్దరించాలని వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ దావాను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మజీద్ కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు పిటషన్లు దాఖలు చేశాయి. ఆలయ పునరుద్ధరణ కోసం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు వారణాసి కోర్టుకు అనుమతి ఇచ్చింది. 1991 నాటి ప్రార్థనా మందిరాల చట్టం ప్రకారం ఈ పిటిషన్‌ను నిషేధించాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.