బిగ్‌బాస్ సీజన్-7(Bigboss Season -7) ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో విన్నర్(Winner)గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth), రన్నర్‌గా అమర్ దీప్ నిలిచారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ బయటకు వస్తుండగా వారి అభిమానులు విధ్వంసం సృష్టించారు. కార్లు, బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అందులో అమర్ దీప్ కారును కూడా పూర్తిగా ధ్వంసమైన సంగతి తెలిసిందే.
ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫైనల్ జరగగా హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటకి వస్తుంటే పలువురు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కార్లు పగలకొట్టి వారిని భయపెట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. ఇక పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు ఆగకుండా వెళ్లిపోవాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పినా రైతుబిడ్డ వినిపించుకోలేదు. పోలీస్ వారితో గొడవ పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి నానా హంగామా చేశారు. ఈ మొత్తం ఘటనలో కొన్ని పోలీస్ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్‌ను A1 గా, అతని తమ్ముడిని A2గా చేర్చి మీడియా వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడ్డ వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫోన్ ఆఫ్ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా డేటాను సేకరించి పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడో కనిపెట్టారు. కొమురవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో రైతు బిడ్డ దాక్కున్నట్లు గుర్తించారు. దీంతో అదుపులోకి తీసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ ఓ వీడియో విడుదల చేశాడు.. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఇంట్లోనే ఉన్నా.. నా గురించి మీడియాలో వస్తున్నదంతా తప్పుడు సమాచారం.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ జోలికే పోలేదు. అది స్విచ్ఛాఫ్‌లోనే ఉంది. నేను ఏ తప్పూ చేయలేదు. ఇతరులు చేసిన వాటిని నాపై వేస్తున్నారు. నన్ను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు.’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు.