షహీద్ విఠల్ లక్ష్మణ్ కొత్వాల్ (Shaheed Vithal Laxman Kotwal)… గొప్ప విప్లవకారుడు. కరువు సమయంలో తన సొంత డబ్బుతో ‘ధాన్యం బ్యాంకు’(Grain Bank)ను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చిన గొప్ప మానవతా వాది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న గొప్ప ఉద్యమకారుడు. ‘కొత్వాల్ దస్తా’పేరిట సమాంతర ప్రభుత్వానికి ఏర్పాటు చేసి బ్రిటీష్ పాలకులకు సవాల్ చేసిన విప్లవ సింహం.
1 డిసెంబరు 1912న మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మథేరాన్ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో జన్మించారు. మాథేరాన్ ప్రాంతంలో నాల్గవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత పుణే ప్రాంతానికి వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. మెట్రిక్ లేషన్‌లో పుణె జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించి గుర్తింపు పొందారు. ముంబైలో లా పూర్తి చేసి న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ చేసుకున్నారు.
తన స్వగ్రామం మాథెరాన్ కు తిరిగి వచ్చిన కొత్వాల్ అక్కడ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు. నిరక్షరాస్యత కారణంగా ప్రజలు మోసపోతున్నారని కొత్వాల్ గుర్తించారు. ఈ క్రమంలో వారిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దేందుకు జిల్లాలో 42 పాఠశాలలను ఏర్పాటు చేశారు. గ్రామంలో కరువు రావడంతో గ్రామస్తులు ఆకలితో అల్లాడి పోయారు.
పేదల ఆకలిని చూసి భరించలేక తన సొంత డబ్బుతో ‘ధాన్యం బ్యాంకు’ను ఏర్పాటు చేసి వాళ్ల ఆకలిని తీర్చారు. 1941లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి వైస్ చెర్మన్ గా ఎన్నికయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ వ్యతిరేక పోరాటం చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా వారంట్ జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
తర్వాత కాలంలో రాయ్‌గఢ్ జిల్లాలో ‘కొత్వాల్ దస్తా’పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొత్వాల్ ను పట్టించిన వారికి రూ. 2500 నగదు బహుమతి ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. డబ్బులకు ఆశపడి ఓ జమిందార్ కొత్వాల్ ఆచూకీ గురించి బ్రిటీష్ వాళ్లకు సమాచారం అందించాడు. దీంతో డీఎస్పీ హాల్ కొత్వాల్ ను పట్టుకుని కాల్చి చంపాడు.