బీఆర్ఎస్ ఎమ్మెల్యే ( BRS MLA) లాస్య నందిత (Lasya Nandita) లిఫ్ట్‌లో ఇరుక్కు పోయారు. న్యూ బోయిన్ పల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆమె వెళ్లారు. ఆస్పత్రిలో మూడవ అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్‌లో ఎక్కారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు పరిమితికి మించి లిఫ్ట్ లోకి ఎక్కడంతో ఓవర్ లోడ్ అయింది. దీంతో లిఫ్ట్ కిందకు వెళ్లి పోయింది.
ఈ పరిణామంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత భయాందోళనలకు గురయ్యారు. ఎమ్మల్యే వ్యక్తిగత సిబ్బంది సమాచారాన్ని ఆస్పత్రి వర్గాలకు అందించాయి. ఆ తర్వాత లిఫ్ట్ డోర్లను ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది బద్దలు కొట్టారు. ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా బయటకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. సాయన్న మరణంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆమె బరిలోకి దిగారు. ఆ నియోజకవర్గ టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం లాస్య నందితపైన నమ్మకాన్ని పెట్టుకున్నారు.
మొదట ఆమె 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆమె పరాజయాన్ని చవి చూశారు. అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.