ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలను నిర్వహిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ప్రజాపాలనను అమలు చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారెంటీల ( guarantees)కు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. పథకాల్లో గత ప్రభుత్వం మాదిరిగా తాము కోతలు పెట్టబోమని స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామన్నారు. గూడెంలో 10 ఇండ్లు ఉన్నా కూడా అక్కడకు అధికారులు వెళ్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
గత పాలకులు ధరణి పోర్టల్ ద్వారా భూములు కబ్జా చేశారని ఆరోపణలు గుప్పించారు. తమది ప్రజల ప్రభుత్వమన్నారు. ప్రజా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ సభలకు వచ్చే వారి కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభల నిర్వాహణ కోసం రూ.25 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని పేర్కొన్నారు.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి సంబంధించిన దరఖాస్తులను ప్రజలకు ముందుగానే ఇస్తామన్నారు. గతంలో 33 శాతం మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేవారని అన్నారు. కానీ ప్రస్తుతం 58 శాతానికి పైగా మహిళలు బస్సుల్లో వెళ్తున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గ్రామసభలో గ్యారెంటీలకు అర్హత ఉన్న వారు దరఖాస్తులు చేసుకుంటే అధికారులు తక్షణమే రశీదులు ఇస్తారన్నారు. దరఖాస్తుల అనంతరం దరఖాస్తుదారుల ఇంటి వద్దకు వెళ్లి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారన్నారు.