షహీద్ రామ్ రఖా (Shaheed Ram Rakha)… గదర్ పార్టీ ( Gadar Party) సభ్యుడు. మయన్మార్‌లో బ్రిటీష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నాలు చేసిన విప్లవ వీరుడు. జైలులో ఖైదీల పట్ల బ్రిటీష్ అధికారుల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేపట్టిన గొప్ప ధైర్య వంతుడు. మాండలే కుట్ర కేసులో అరెస్టై చిత్ర హింసలు అనుభవించి ప్రాణాలు విడిచిన గొప్ప దేశ భక్తుడు.
1884లో పంజాబ్‌లోని హోషియార్ పుర్‌లో పండిట్ రామ్ రఖా జన్మించారు. తండ్ర జవహీర్ రామ్. గదర్ పార్టీకి చెందిన సోహన్ లాల్ పాఠక్‌తో రామ్ రఖాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బర్మా, మలయా, సింగపూర్ దేశాల్లో స్వాతంత్ర్య పోరాటాన్ని ఉధృతం చేస్తూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని గదర్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా బర్మాలో తిరుగుబాటు గురించి విప్లవ వీరులకు సందేశం ఇచ్చేందుకు రామ్ రఖాను గదర్ పార్టీ పంపింది.
రామ్ రఖాతో పాటు ముజ్తాబా హుస్సేన్, అమర్ సింగ్, అలీ అహ్మద్ లను బర్మాకు వెళ్లాలని గదర్ పార్టీ ఆదేశించింది. తిరుగుబాటుకు కావాల్సిన మందుగుండు సామాగ్రిని రామ్ రఖా సేకరించడం మొదలు పెట్టారు. మాండలే కుట్ర గురించి తెలుసుకున్న పోలీసులు రామ్ రఖాతో పాటు మిగిలిన ముగ్గురు ఉద్యమకారులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు.
1917 మార్చి 28న మాండలేలో విచారణ ప్రారరంభించారు. బ్రిటీష్ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రణాళికలు రచించడం, కుట్ర, బ్రిటీష్ ఆర్మీలో సమైక్యతకు భంగం కలిగించడం వంటి అభియోగాలను ఆ నలుగురిపై పోలీసులు నమోదు చేశారు. ముజ్తబా హుస్సేన్, అమర్ సింగ్, అలీ అహ్మద్ సాదిక్‌లకు మరణ శిక్ష విధిస్తూ
జూలై 6, 1917న న్యాయస్థానం తీర్పు వెలువడింది.
షహీద్ రామ్ రఖాకు జీవిత ఖైదు విధించింది. దీంతో ఆయన్ని అండమాన్ లోని సెల్యూలార్ జైలుకు పంపారు. అక్కడ ఖైదీల పట్ల అధికారుల క్రూరమైన ప్రవర్తను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఆయన జంధ్యాన్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారితో ఘర్షణకు దిగి రామ్ రఖా నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ నిరాహార దీక్ష విరమించేందుకు రామ్ రఖా ససేమేరా అన్నారు. దీంతో చివరకు రక్తపు వాంతులు చేసుకుని మరణించారు.