అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట (consecration ceremony) చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు విడుదల చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా వుంటే ప్రాణ ప్రతిష్టాపనకు జనవరి 22న మధ్యామ్నం 12.30 గంటల సమయంలో మహత్తరమైన ముహూర్తం ఉందని జ్యోతిషులు చెబుతున్నారు. శుభ ముహూర్తం 84 సెకన్ల పాటు ఉంటుందని అంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని చెబుతున్నారు.
ముహూర్తం వివరాలను యూపీ వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్న సమయంలో గురు స్థానం అత్యంత బలంగా ఉంటుందన్నారు. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు గురు ఉచ్ఛస్థితిలో ఉంటాడని పేర్కొన్నారు. ఆ సమయంలో గురు రాజయోగం కల్పిస్తాడన్నారు.
వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఆ సమయంలో గురు ఐదు, ఏడు, తొమ్మిదో స్థానంలో ఉంటాడని వివరించారు. గురువు ఏడవ స్థానంలో ఉంటే అందరి మనసులు చక్కగా ఉంటాయన్నారు. లక్ష సమస్యలను కూడా పరిష్కరించే సామర్థ్యం గురువుకు ఉందని వివరించారు.
సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు అది అత్యంత శుభ ముహూర్తం అవుతుందని గణేశ్వర్ శాస్త్రి అన్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. మూడింట రెండొంతుల గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా మంచిదన్నారు. ఆ సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహిస్తే ప్రపంచంలో దేశ కీర్తి మరింత పెరుగుతుందన్నారు.
మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే ట్రస్టు వెల్లడించింది. ఇక ప్రాణప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలో హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని చోట్ల రేట్లు రూ.లక్షకు చేరాయి. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్ ఆపరేటర్లు అంటున్నారు.