కరోనా మహమ్మారి ప్రజలను మరోసారి భయపెడుతోంది. సంగారెడ్డి (sangareddy)జిల్లాలో కొవిడ్ (COVID) కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లాలో నాలుగు కొవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇందులో భయాపడాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు.
కొవిడ్ వచ్చిన వ్యక్తుల్లో ఒకరు కరోనా నుంచి కోలుకున్నారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. ఇటీవల జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కొవిడ్ బారిన పడిన వారి కాంటాక్ట్ హిస్టరీని అధికారులు సేకరిస్తున్నారు. సదరు వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఎక్కడకు వెళ్లారనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొటి చొప్పున కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,322 మందికి కొవిడ్ టెస్టులు చేయడంతో పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.