తెలంగాణను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం తెలంగాణ సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు సీఎం వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా అందించడంతో పాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అన్నివర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామని సీఎం తెలిపారు.
ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
కాగా, యాపిల్ ఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థకు కొంగర కలాన్‌లో గత ప్రభుత్వం సుమారు 120ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఫాక్స్ కాన్ను బెంగళూరు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ఆ కంపెనీ ప్రతినిధులకు భరోసానివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.