– మణిపూర్ టు ముంబై
– మరో యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ
– జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర
– మార్చి 20 వరకు షెడ్యూల్
– 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో ఏర్పాట్లు
– 65 రోజుల పాటు 6,200 కి.మీ. నడక
భారత్ జోడో యాత్ర తరహాలో మరో పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు. జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ఈ యాత్రను ఆయన మొదలు పెట్టనున్నారు. ముంబై వరకు ఇది కొనసాగనుంది.
యాత్రకు సంబంధించిన విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దేశంలో తూర్పు భాగం నుంచి పశ్చిమ రాష్ట్రాలకు మరో పాదయాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీని డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ కోరికను మన్నించి పాదయాత్రను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఈ క్రమంలో జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందన్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మొదలై ముంబై వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా మొత్తం 65 రోజుల పాటు 6,200 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల గుండా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
మణిపూర్, నాగాలాండ్, అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల గుండా ఈ యాత్ర సాగుతుందన్నారు. పాదయాత్ర సమయాల్లో ఆయా రాష్ట్రాల్లో మహిళలు, రైతులు, సాధారణ ప్రజలు, యువతతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవుతారని వివరించారు.