న్యూ ఇయర్ (New Year) వేడుకల వేళ పోలీసులు (Police) ఆంక్షలు విధిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా డ్రంకెన్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలను పోలీసులు ముమ్మరం చేయనున్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారికి భారీగా జరిమానాలు విధించనున్నట్టు వెల్లడించారు.
న్యూ ఇమర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి రూ. 15000 వరకు జరిమానా విధించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై రూ. 10000 జరిమానాను విధించనున్నారు. దీంతో పాటు గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే వారికి రూ.15,000 జరిమానా విధించనున్నారు. దీంతో పాటు గరిష్టంగా రెండేండ్ల పాటు జైలు శిక్షకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని తెలిపారు. అందువల్ల మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
అటు న్యూ ఇయర్ వేళ ప్రయాణికు నుంచి క్యాబ్ డ్రైవర్లు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తే ఊరుకోబోమన్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. ఇక న్యూ ఇయర్ సందర్బంగా నగరంలో పలు ఫ్లై ఓవర్లను పోలీసులు మూసి వేయనున్నారు.
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ , శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, షేక్‌పేట ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్లు (1 & 2), మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్ తో పాటు నగరంలోని పలు ఫ్లై ఓవర్లను పోలీసులు మూసి వేయనున్నారు. వాటితో పాటు ఔటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా మూసివేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు.