రాజన్న సిరిసిల్ల (Rajanna sircilla) జిల్లాలో వస్త్ర పరిశ్రమ (Textile Industry) బంద్ కొనసాగుతోంది. పవర్ లూమ్ (Power loom) యాజమాన్యం చేపట్టిన బంద్ మూడవ రోజుకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో వస్త్ర పరిశ్రమను బంద్ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు సోమవారం నుంచి పరిశ్రమను బంద్ చేసినట్టు యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం టెక్స్ టైల్ పార్కులో వస్త్ర ఉత్పత్తిని ప్రారంభిస్తామని యజమానులు చెబుతున్నారు. కానీ కార్మికులు మాత్రం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ముందు చర్చలు జరపాలని, ఆ తర్వాతే పనిలోకి వెళ్లాలని కార్మిక సంఘాల నేతలు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే రూ. 35 కోట్ల విలువైన వస్త్రాలు మిల్లుల్లో పేరుకు పోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా పాలిస్టర్ యాజమానులు నూలు కొనుగోలు చేసే పరిస్థితులు లేవని చెబుతున్నారు. మరోవైపు గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన పాత బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులు పెట్టడం తమకు భారంగా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోతే పరిశ్రమలు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.