అయోధ్య (Ayodhya)లో జనవరి 22న ‘రామ్ లల్లా’ (Ram Lalla)విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్బంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిచింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 22న కేంద్ర ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ క్రమంలో తెలంగాణలో కూడా సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. అయోద్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట కోసం దేశం మొత్తం వేల కండ్లతో ఎదురుచూస్తోందని అన్నారు.
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గోవాలని పిలుపునిచ్చారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిధుల సమీకరణ విషయంలో తెలంగాన రాష్ట్రం రెండవ స్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులకు అక్షింతలు కావాలంటే బాస్మతి బియ్యం అయోధ్యలోని శ్రీరాముని పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తామని చెప్పారు. అయోధ్య రాముడు కేవలం బీజేపీకి మాత్రమే దేవుడు కాదన్నారు. దేశంలోని అందరికీ శ్రీరాముడు దేవుడేనని చెప్పారు. రాముడిని బీజేపీకి ఆపాదించి వివాదాస్పదం చేయడం సరికాదని సూచించారు.