సర్పంచ్, ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. సర్పంచ్,ఎంపీటీసీ, జడ్పిటీసీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా, వారిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకు వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సీఎస్ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనం, 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను బలోపెతం చేస్తామని చెప్పారు.
కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించాడని నిప్పులు చెరిగారు. ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా, నేరుగా ఢిల్లీ నుంచి పవర్ పైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 20 గ్రామాలకు పంచాయితీ భవనం కోసం 25లక్షలు,అంగన్వాడీ భవనం కోసం 10లక్షలు మంజూరు చేయించామన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక ఏపీకి ఏడు మండలాలు పోయాయన్నారు. పదేండ్లలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. కృష్ణా బోర్డు పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటిని ఏపీ డైవర్ట్ చేసుకున్నారని ఆరోపించారు.
ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతుంటే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తెలంగాణకు వస్తుంటే కాదని.. లక్ష కోట్లతో గోదావరి నీటిని వాడుకుంటామని కాళేశ్వరం కట్టారని విమర్శలు గుప్పించారు.