ఎమ్మెల్సీ (MLC)లుగా ఎన్ఎస్యూఐ (NSUI)రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (Balmuri Venkat), టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఈ మేరకు వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్లకు అసెంబ్లీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. దీంతో ఆ సర్టిఫికెట్ను తీసుకునేందుకు అసెంబ్లీకి అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆ ఇద్దరు నేతలు భారీ ర్యాలీగా బయలు దేరారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీ హరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో ఎమ్మెల్యేల సంఖ్యాత పరంగా చూస్తే కాంగ్రెస్ కు బలం ఎక్కువగా ఉంది. దీంతో ఈ రెండు స్థానాలు అధికార పార్టీకే దక్కే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ దూరంగా ఉంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈ రోజు చివరి రోజు కావడం ఇప్పటి వరకు ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.