బీఆర్ఎస్ (BRS) పార్టీ అంటే అధికార పార్టీకి భయం పట్టుకుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితాలక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాపాలకు ఒడిగడుతోందంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో బీఆర్ఎస్ భవనం కూల్చివేతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు చెందిన ప్రజా ప్రతినిధుల మాటలు నమ్మి ఎలాంటి విచారణ జరపకుండానే అధికారులు బీఆర్ఎస్ భవనాన్ని కూల్చడం దారుణమని అన్నారు. సదరు భవనాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని అధికార కార్య కలాపాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ భవనాన్ని విచక్షణారహితంగా కూల్చి వేయడం సరికాదన్నారు.
శాంతియుతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్పై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను కూల్చేస్తారా అని నిలదీశారు.
యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. 100 మంది పోలీసుల బందోబస్తు మధ్య బీఆర్ఎస్ ఆఫీసును జేసీబీతో నేలమట్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.