మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భ్రమల్లో బతకడం మానేసి.. వాస్తవంలోకి రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు.
మీడియాతో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 13 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ చర్చలో కూడా ఉండదని తెలిపారు. అసలు బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలనే విషయాన్ని ప్రజలు కనీసం పట్టించుకోబోరన్నారు. కానీ కేటీఆర్ మాత్రం శ్రేణులకు చాలా పెద్దపెద్ద లెక్చర్లు ఇస్తున్నారన్నారు.
మేడిగడ్డ విషయంలో డ్యామేజ్‌కు గల కారణాలు అతి త్వరలోనే తేలుతాయని చెప్పారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదిక తనకు ఇంకా అందలేదని అన్నారు. అతి త్వరలోనే అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల వరకు మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ డిజైన్, ప్లానింగ్ మొదలు మెయింటెనెన్స్ దాకా ఏ స్థాయిలో, ఎక్కడ లోపాలు ఉన్నాయనే విషయం బయటకు వస్తుందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ విషయంలో ఇప్పటి దాకా చాలానే వార్తలు వచ్చాయని అన్నారు. త్వరలోనే నివేదిక ద్వారా సమగ్రమైన సమాచారం అందుతుందని చెప్పారు. డ్యామేజీకి నిర్దిష్టమైన కారణాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. నివేదికలో విజిలెన్స్ అధికారులు ఎలాంటి సిఫారసులు చేస్తారన్నది కూడా ఇప్పుడే చెప్పలేమని వివరించారు.