తెలంగాణ కుంభ మేళాగ ప్రసిద్ధి చెందిన మేడారం (Medaram) జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ జాతరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తుల వస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు జాతరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తుల కోసం ప్రత్యేక బస్సుల (Buses)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఇది ఇలా వుంటే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు వర్తించదని ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కానీ తాజాగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం సౌకర్యం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
అంతకు ముందు మేడారం జాతర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింప చేయకుండా ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రతిపాదనల గురించి చర్జ జరిగింది.
మేడారం జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే టీఎస్ఆర్టీసీ ఆదాయం భారీగా పెరుగుతుందన్న సజ్జనార్ ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాల్సిందేనని ఆదేశించినట్టు తెలుస్తోంది. వన దేవతలను దర్శించుకునేందుకు మహిళా భక్తులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు.
ఇక ఈ ఏడాది మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర కోసం ప్రత్యేకంగా 6,000 ప్రత్యేక బస్సులను నడపాలని ఇటీవల ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి మరో రెండు వేల బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.