బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకి షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (Prakash Goud) భేటీ అయ్యారు. ఇరువురు నేతలు సుమారు గంట పాటు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎంను మర్యాదపూర్వకంగా కలిశానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చెబుతున్నారు. ఇది ఇలా వుంటే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్‌ను బొంద పెడతామంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో వరుసగా సీఎంతో బీఆర్ఎస్ నేతల భేటీలపై పలు రకాల ఊహగానాలు వెలుబడుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలోనే నిన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. ఓ వైపు పులి బయటకు వస్తోందని ఓ వైపు బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే… మరోవైపు ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని కలుస్తుండం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.