మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakil) కుమారుడు హిట్ అండ్ రన్ (Hit and Run)కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి బోధన్ సీఐతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు సోహైల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించారన్న ఆరోపణలపై బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.
ఇదే కేసులో షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకుని మాసబ్ ట్యాంక్ డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. తాజా విచారణతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్ 23న హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ వద్ద బారీకెడ్లను ఢీ కొడుతూ దూసుకు వెళ్లింది.
యాక్సిడెంట్ తర్వాత సోహెల్ ను పోలీసులు పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సోహెల్ బయటకు వచ్చారు. సోహెల్ స్థానంలో అతని డ్రైవర్ను స్టేషన్ కు పంపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ అప్పటికే సోహెల్ దుబాయ్ పారి పోయాడు.
ఈ కేసులో సోహెల్ కు 10 మంది సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు రోడ్డు ప్రమాదం జరిగిన రోజు పంజాగుట్ట సీఐతో బోధన్ సీఐ మాట్లాడినట్టు దర్యాప్తు సమయంలో పోలీసులు గుర్తించారు. ఇక సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.