మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కూలి పోతుందని అన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర చేస్తుంటే ఇండియా కూటమి నేతలంతా ఆ కూటమిని చోడో చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
బెల్లంపల్లి టౌన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ…. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా.. ఇప్పుడు చూపిస్తారా అని మీడియాను ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి సమావేశమైన మూడు రోజులకే సీఎంతో అదానీ భేటీ అయి పెట్టుబడులు పెడతాననడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. సింగరేణిపై అదానీ కన్ను పడిందని ఆరోపణలు గుప్పించారు. తనపై, తన గురువుపై ఉన్న కేసులను రద్దు చేయించుకునేందుకు కేంద్రం వద్ద రేవంత్ రెడ్డి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
సింగరేణి కార్మికులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కొంత మంది అధికారులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని అందరిని సమానంగా చూడాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే క్రమంలో పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేదనేది వాస్తవమేనని ఒప్పుకున్నారు. కార్యకర్తలను, నాయకులను భాగస్వామ్యం చేయకుండా అంతా ఆన్ లైన్లో నడిపించడం తమ పార్టీ ఓటమికి కారణమన్నారు.