తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey) అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది.
దీంతో పురుషులకు కనీసం నిలబడడానికీ చోటులేక ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50రోజుల నుంచి అవస్తలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు.. ఫ్రీ జర్నీకి సంబంధించిన జీవో 47 ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది.
పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ రూట్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సు దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇబ్రహీంపట్నం- ఎల్ బీ నగర్ రూట్లో ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆ మార్గంలో 277 ఎల్ సిటీ ఆర్డినరీ బస్సును పురుషులకు స్పెషల్గా నడుపుతున్నారు. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మిగతా రూట్లలోనూ పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని, లేదంటే బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.