టాలీవుడ్ (TollyWood) మాదక ద్రవ్యాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్లో మాదక ద్రవ్యాల వ్యవహరానికి సంబంధించి సిట్ (SIT) మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేయగా అందులో 6 కేసులను నాంపల్లి కోర్టు (Nampally Court)కొట్టి వేసింది.
ఆయా కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేని నేపథ్యంలో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసుల్లో ఎక్సైజ్ శాఖ సరైన ప్రొసీజర్‌ను పాటించలేదని కోర్టు పేర్కొంది. అప్పట్లో టాలీవుడ్లో మాదకద్రవ్యాలు కలకలం రేపాయి.
ఈ కేసు విచారణకు అప్పటి కేసీఆర్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ పలువురు సినీ తారలను ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది కేసులను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. నటీనటుల గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించింది.
అనంతరం వాటిని ఎఫ్ఎస్ఎల్కు ఎక్సైజ్ పోలీసులు పంపించారు. అందులో పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్ పరిశీలించింది. వాళ్ల శరీరంలో మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో నివేదిక ఆధారంగా 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.