రాజకీయ నేతలు ఏం ధరించినా దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) వాచ్ నుంచి మొదలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పుల వరకు అన్నింటిపై ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్ న్యూ లుక్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎప్పుడూ తెల్ల చొక్కాలు ధరించి ఆయన చాలా సింపుల్గా కనిపిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు పొందారు. కానీ తాజాగా ఆయన తన లుక్ మార్చారు. మోడీ తరహా జాకెట్ వేసుకుని ఢిల్లీలో సందడి చేశారు. ఇప్పుడు ఆయన న్యూ లుక్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈటల న్యూ లుక్ అదిరి పోయిందంటూ కొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయని… అందుకే ఈ సందడంతా అని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసిన ఆయన తాజాగా లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు.
అందుకే ఈ న్యూ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోటు వేసుకుంటే జాతీయ నాయకులు అవుతారా అంటూ ఇంకొందరు ప్రశ్నలు వేస్తున్నారు. ఢిల్లీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈటల అభిమానులు మాత్రం తమ నేత న్యూ లుక్ అదుర్స్ అంటున్నారు.