56 ఏండ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ (Congress) పాలించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy_ అన్నారు. కానీ ఈ 56 ఏండ్లలో ఎప్పుడూ రాష్ట్రానికి న్యాయం చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను మల్లారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధించాలని కోరుకున్నట్టు వెల్లడించారు.
మాజీ సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. కొండగట్టు అభివృద్ధికి గత బీఅర్ఎస్ సర్కార్ రూ. 500 కోట్ల నిధులను ప్రకటించిందని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు పాజిటివ్ వాతావరణం ఉందన్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చూపుతుందని పేర్కొన్నారు. ఇది ఇలా వుంటే కొండగట్టు అంతరాలయం మల్లా రెడ్డి పూజలు చేశారు.
ఆ సమయంలో మల్లారెడ్డి గన్ మెన్ కూడా ఆయుధంతో ఆలయంలోపలికి ప్రవేశించారు. ఓ వైపు ఆలయ సిబ్బంది వారించినప్పటికీ ఆయుధంతో అంతరాలయంలోనే గన్ మెన్ ఉన్నాడు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆయుధంతో ఆలయంలోకి గన్ మెన్ ప్రవేశించడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.