సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao)నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని తెలిపారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే స్పష్టంగా ఉందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. ‘మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పైకి నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు’అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
‘గత ప్రభుత్వం కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది. కేసీఆర్ లోక్ సభలో ఉండగానే 2014 పునర్విభజన చట్టం అమోదం పొందింది. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని రాసిందని కేసీఆర్ చెప్పారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగి పోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలకు లెక్కే లేదు’అని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్ ఆమోదం మేరకే ఈ చట్టం వచ్చింది. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ, ఇతర అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. తెలంగాణకు శాశ్వతంగా రావాల్సిన నీటి హక్కును ధారాదత్తం చేశారు. ఇప్పుడు చట్టం వల్ల తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆర్ దే బాధ్యత’అని అన్నారు.
‘కేసీఆర్ ఈ చట్టానికి, పుస్తకానికి పూర్తి రచయిత. 2015లో కేఆర్ఎంబీ మీటింగ్‌లో తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని కేసీఆర్ అంగీకారం తెలిపారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలపై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్, అధికారులు ఒప్పుకొని సంతకాలు పెట్టి.. ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారు’అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ 2022లో సంతకాలు చేశారని వెల్లడించారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్‌లో రూ.400 కోట్లను కేటాయించారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు.
కమీషన్ల కోసం జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. జల దోపిడీకి కారణం కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీ శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చిద్దామన్నారు. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చ జరిగినంత సేపు కేసీఆర్ కూర్చోవాలన్నారు. కేసీఆర్ కు మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామన్నారు.
తెలంగాణకు రావాల్సిన నీటిని జగన్ ఎత్తుకు పోతుంటే కేసీఆర్ నోరు మెదపలేదు. గ్రావిటీ ద్వారా కృష్ణా నదిలో వచ్చే 8 టీఎంసీల నీటిని వదులుకున్నారు. నేరుగా కేసీఆర్ తెలంగాణపై కుట్ర చేశారు. తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరిగి రాసేందుకు పయత్నాలు చేస్తున్నాం. కాళేశ్వరంపై నిపుణులే తేలుస్తారు’అని వెల్లడించారు.
కాళేశ్వరంపై విచారణ కోసం జడ్జిలను నియమించాలని లేఖలు రాశాం. చట్ట పరిధిలో ఏం చేయాలో.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్వ నాశనం చేశారు. రూ. 95000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీరవ్వలేదు. కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో ఏం కుట్రలు చేశారో’అని నిప్పులు చెరిగారు.