హైదరాబాద్(Hyderabad) నుంచి శ్రీశైలం(Srishailam) మల్లిఖార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకునే వారికి శ్రీశైలం ఆలయంలో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో రోజువారీగా 1,200 దర్శన టిక్కెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతీ 20 నిమిషాలకు ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు తిరుగుతాయని వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510లను ఆర్టీసీ ఖరారు చేసింది. 500 సూపర్ క్విక్ దర్శన్ టిక్కెట్లు, 500 క్విక్ దర్శనం టిక్కెట్లు, మరో 200 స్పర్శ దర్శనం టిక్కెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వీటిలో స్పర్శ దర్శనం టిక్కెట్ ధర రూ.500, శీఘ్ర దర్శనం ధర రూ.300, శీఘ్ర దర్శనం ధర రూ.150 అని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 90ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60రోజుల్లోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహిళలతో కలిసి రూ.535 కోట్ల చెక్కును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సీఎం అందజేశారు.