Telugu News » Kishan Reddy : మోడీకి ఓటు వేయాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు…!

Kishan Reddy : మోడీకి ఓటు వేయాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు…!

కమలం గుర్తుకు ఓటెయ్యాలని, నరేంద్ర మోడీ (Modi)ని గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

by Ramu

బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కమలం గుర్తుకు ఓటెయ్యాలని, నరేంద్ర మోడీ (Modi)ని గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతోందని తెలిపారు.

ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5 యాత్రలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

ఈ ఎన్నికలు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసమని.. సుస్థిరతకు అస్థిరత కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు.. రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్‌లు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి ఒకటి వరకు విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టామన్నారు.

భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు భాగ్యనగరం అని పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు.
కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరును నిర్ణయించినట్టు చెప్పారు. వీటితో పాటు మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణమ్మ అని, ఖమ్మం, వరంగల్, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కాకతీయ అని పేర్లను పెట్టామన్నారు.

ప్రతి రోజు 2, 3 అసెంబ్లీ నియోజక వర్గాలను ఒక్కో యాత్ర కవర్ చేస్తుందన్నారు. ముఖ్య నేతలు అందరూ అన్ని యాత్రల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఈ యాత్రల సందర్భంగా ఎక్కువ రోడ్ షో లు ఉంటాయని అన్ని యాత్రలు హైదరాబాద్ లో ముగిసే విధంగా ప్లాన్ చేస్తున్నామని, హైదరాబాద్ పార్లమెంట్ లో గెలిచేందుకు పోటీ చేస్తామన్నారు.

 

You may also like

Leave a Comment