ఇందిరమ్మ రాజ్యం మీద బంజారాలకు నమ్మకం, విశ్వాసం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంజారాలు కాంగ్రెస్ (Congress) పక్షాన నిలబడ్డారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యానికి, బంజారాలకు ఉన్న బంధం పెవికల్ లాంటిదని అన్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని బంజారా భవన్ స్థలంలో సంత్ సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మానవ హింస, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని సంత్ సేవాలాల్ సూచించారని తెలిపారు.
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చిందన్నారు. ఈ నెల 15న గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించారని…అందులో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిపారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్ సభలో ప్రజలందరి సమక్షంలో చాలా అద్భుతంగా ఈ జయంతిని జరుపుకున్నామని చెప్పారు. ఏ కులమైనా, ఏ మతమైనా ఆయన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపిన తర్వాత తన కడుపును సంత్ సేవాలాల్ మహరాజ్ నింపుకునేవారన్నారు. ఇలాంటి సేవల కార్యక్రమాలు ఎన్నో చేసి పేదల కడుపు నింపాడు కాబట్టి దేవుడయ్యాడని పేర్కొన్నారు.