తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ (BRS) పదేండ్లుగా మోసం చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. ఇకపై తెలంగాణకు బీఆర్ఎస్ ఏ మాత్రం అవసరం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే బీజేపీ సంకల్ప యాత్రలను పూర్తి చేయాలని అనుకుంటున్నామన్నారు. ప్రచార మాధ్యమాలు ద్వారా వస్తున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ 370 సీట్లు,ఎన్డీఏ కూటమికి 400 సీట్లు లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ఇండియా కూటమి టెంట్స్ కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే నమ్మకం లేక ఆ కూటమి నుండి బయటకు వస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల తరవాత విదేశాలకు వెళ్లిపోతారని పేర్కొన్నారు. మరోవైపు.. యాత్రల సందర్భంగా బీజేపీలో చేరికలు ఉంటాయని చెప్పారు.