అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర(Medaram Jathara)కు భక్తులు పోటెత్తుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే, తెలంగాణలోనే అనాదిగా మినీ మేడారం జాతర జరుగుతోంది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు అక్కడ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా(Siddipet District)లోని నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంది. ఏళ్లుగా ఇక్కడ మినీ మేడారం జాతర జరుగుతోంది. మేడారం జాతర మాదిరిగానే ప్రతీ రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటిరోజు సారలమ్మ, రెండోరోజు సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. భక్తులు శుక్రవారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం సాయంత్రం అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ వేడుకల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో రాత్రి వేళల్లో కథల కార్యక్రమం నిర్వహిస్తారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేయడంతో అక్కెనపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ జాతరకు విశేషమైన చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కెనపల్లి గ్రామ శివారులోని పులిగుండ్ల సమీపంలో ఓ గొర్రెల కాపరి 40 ఏళ్ల కిందటే మేకలను మేపుతుండగా పెద్ద బట్టతల ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయి. సమ్మక్క తల్లి పులిపై స్వారీ చేస్తుందని, అందుకే గ్రామంలోని పులి గుట్టల వద్ద పసుపు రంగులో దర్శనమిస్తుందని గ్రామస్తుల నమ్మకం. ఈ విషయాన్ని పూనకం వచ్చిన ఓ మహిళ చెప్పిందని గ్రామస్తులు అంటున్నారు.
1984లో పులిగుండ్ల సమీపంలో తలో 14 ఎకరాల భూమిని సేకరించి సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి కోడలు లక్ష్మి, పగిద్దరాజు (నాగుపాము) విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతీరోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం తరహాలోనే రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మలు ఉసిరికాయలు వేసి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.