– కాళేశ్వరంపై పక్కదారి పట్టించిన బీఆర్ఎస్ సర్కార్
– తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై అన్నీ అబద్ధాలే
– నీటి నిల్వ విషయంలోనూ తప్పుడు మాటలే
– కేంద్రాన్ని సైతం మ్యానిప్లేట్ చేశారు
– సర్వే చేయకుండా మేడిగడ్డ కట్టడం అతిపెద్ద తప్పు
– కాళేశ్వరం డిజైన్ సీడబ్ల్యూసీ ఆమోదించలేదు
– రీ-ఇంజనీరింగ్ అనేది భారీ తప్పిదం
– థర్డ్ టీఎంసీ ఆలోచన అర్థరహితం
– జల సంఘం ప్రశ్నలకు సమాధానాలేవి?
– కాళేశ్వరంపై కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
– మేడిగడ్డపై విచారణకు డ్యామ్‌సేఫ్టీ కమిటీ
– వచ్చేవారంలో బ్యారేజీ పరిశీలన
రాష్ట్రంలో కాక రేపుతున్న మేడిగడ్డ వ్యవహారంపై విచారణకు డ్యామ్‌సేఫ్టీ కమిటీ ఏర్పాటైంది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వచ్చే వారంలో ఎన్డీఎస్ఏ కమిటీ బ్యారేజీని పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ అక్రమాలు, నదులు, ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌పై కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ కీలక వివరాలు వెల్లడించారు. ‘కాళేశ్వరం డిజైన్, ఇన్వెస్ట్మెంట్ ను సీడబ్ల్యూసీ అప్రూవల్ చెయ్యలేదన్నారు. 80 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది అన్న ప్రశ్నలకు గత ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని.. సీడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం ప్రాజెక్టులు కట్టాం అనేది కూడా అవాస్తవమని తెలిపారు. ప్రజల్లో భ్రమలు కల్పించి ఎమోషనల్ సృష్టించడం సరికాదని హితవుపలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఎక్కువగా ఖర్చు అయ్యాయని, ఆ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తేల్చి చెప్పారు. నీటి ఎత్తిపోతల కోసం ఏటా అయ్యే రూ.10 వేల కోట్లు ఆదా అయ్యేవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లేదని, డిజైన్ ఫెయిల్, కావున పూర్తి బాధ్యత నీటిపారుదల శాఖదేనని స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం రూపాయి ఖర్చు చేస్తే రూపాయిన్నర రావాలి కానీ ఇక్కడ అలా లేదని తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ఆయకట్టు కింద ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయితే 100 నుంచి 120 బస్తాలు దిగుబడి వచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపారంటూ తీవ్రంగా తప్పుపట్టారు. ‘తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం గత ప్రభుత్వం మహారాష్ట్రను ఓప్పించలేకపోయింది. అందుకే రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. రూ.11వేల 99కోట్లతో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. 40వేల కోట్ల ప్రాజెక్ట్ ను లక్షా 20వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ ఖర్చు చేసింది’ అని శ్రీరామ్ తెలిపారు. మానవ తప్పిదం వల్ల సరైన నిర్వహణ లేకపోవడంతో రెండు ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని, వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు దిక్కు లేదని ఈ విషయాన్ని నేషనల్ సేఫ్టీ అథారిటీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విఫలమయ్యాయని ఇరు రాష్ట్రాల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను శ్రీరామ్ వెల్లడించారు. ఇద్దరూ గొడవపడితే తాము ఎలా బాధ్యత వహిస్తామని సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జలాలు కేఆర్ఎంబీకి తాకట్టు పెట్టారని అనడం తప్పు.. ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుని ఏం చేస్తామని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో అన్ అప్రూవుడ్ ప్రాజెక్టులకు నీరు వెళుతోందని శ్రీరామ్ తెలిపారు. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు జల్‌శక్తి అనుమతి లేదని ఇది అన్ అప్రూవుడ్ ప్రాజెక్టు అని తేల్చారు. కృష్ణా నుంచి అనధికారికంగా నీరు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతి కోరితే సీడబ్ల్యూసీ నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.