రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు తెలిపింది. నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. భానుడి తాపం(Temperature)తో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వర్ష సూచన కాస్త ఊరటనే చెప్పాలి.
రాబోయే కాలంలో తూర్పు, మధ్య భారతదేశంలో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 16 నుంచి నాలుగు రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో వాతావరణం మారడం ప్రారంభించిందని తెలిపింది.
వాతావరణ పరంగా రాబోయే 72గంటలు చాలా ముఖ్యమైనవని ఐఎమ్‌డీ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని చెప్పింది. శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.9డిగ్రీలు, హైదరాబాద్ గరిష్టంగా 40డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది.
పాటిగడ్డలో గురువారం అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో 16, 17, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, వర్షాలతో ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించినప్పటికీ యాసంగి పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.