ఏపీ రాజకీయాలు (AP Politics) రసవత్తరంగా మారాయి. మరికొద్ది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. నాలుగో విడతలో మే 13న ఏపీ అసెంబ్లీకి సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార వైఎస్సార్సీపీ(YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) పార్టీలు ఇప్పటికే జోరుగా రాజకీయ సభలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రజాగళం పేరుతో ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంయుక్తంగా ఆదివారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించాయి. ఆ సభకు ప్రధాని మోడీ విచ్చేసి ప్రసంగించారు. అయితే, సభ జరిగిన తీరుపై అధికార వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తోందని ఈసీకి ఫిర్యాదులు అందాయి.
ముఖ్యంగా సీఎం జగన్ను టార్గెట్ చేసిన పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని వైసీపీ పార్టీ ఫిర్యాదు చేయగా సీఈవో ముఖేశ్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఆదేశించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందిస్తూ బాబుకు ఈసీ నోటీసులు పంపించింది. సీఎం జగన్పై పెట్టిన అసభ్యకర పోస్టులు డిలీట్ చేయడంతో పాటు ఎన్నికల నియామళిపై ఉల్లంఘనపై సమాధానం చెప్పాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు, కించపరిచేలా పోస్టులు పెట్టడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.