వలస కార్మికులకు దేశ సర్వోన్నత (Supreme court) న్యాయస్థానం శుభవార్త (Good news) చెప్పింది. వీరికి రేషన్ కార్డులు (Ration cards) తప్పకుండా ఇవ్వాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ శ్రమ్ పోర్టల్ (E-shram portal)లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికుల(Migrant Labours)కు స్థానికతను చూడకుండా రేషన్ కార్డులు మంజూరు చేయాలని సుప్రీం ఆదేశించింది.
2023లో ఇచ్చిన ఆదేశాలు నేటికి అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం 2 నెలల్లో ఇప్పటివరకు ఈ శ్రమ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి రేషన్ కార్డులు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని స్పష్టంచేసింది.
అయితే, వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని 17 ఏప్రిల్ 2023లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికులు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటిది వారికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు నిరాకరించరాదని పేర్కొంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణ జనాభాలో 50 శాతం మందికి పీడీఎస్‌లో రాయితీపై ఆహార ధాన్యాలు ఇవ్వాలని గతేడాది ఇచ్చిన తీర్పులో పేర్కొంది. అయితే, ఈ పంపిణీ నిష్పత్తిని 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేయడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. 12 ఏళ్ల కిందట జనాభాకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడింది. ఇప్పుడున్న కార్డుదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కొత్తవారికి కేంద్రం, రాష్ట్రాలు కొత్త కార్డులు ఇస్తున్నాయి. ఇలా చేయడం వలన లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని సుప్రీం వెల్లడించింది. దీనికి త్వరగా ఒక పరిష్కార మార్గం చూపి వలస కార్మికులకు రేషన్ కార్డులు అందించాలని తెలిపింది.