లోకసభ, నాలుగు రాష్ట్రాలు (ఒడిశా, ఏపీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్) అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ కమిషనర్లు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఈసీ (CEC) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ (AndraPradesh) అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో భాగంగా నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ పర్సంటేజీ పెంచడానికి సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో అత్యవసర సేవల విభఆగాల్లో పనిచేసే వారికి ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, ఎఐఆర్, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, ఆరోగ్యశాఖ, ఆహార కార్పోరేషన్, ఆర్టీసీ, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, ఏఏఐ, పీఐబీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
వచ్చే ఎన్నికల్లో అత్యవసర సేవల విభాగాలను పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం వలన ఓటింగ్ పర్సంటేజీ తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావించిన ఈసీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎన్నికల విధులు, ఎమర్జెన్సీ విభాగంలో వర్క్ చేసే వారికి చాలా ప్రయోజనం కలుగనుంది.
ఇదిలాఉండగా, ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లు అసెంబ్లీ ఓటింగ్లో తప్పకుండా ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తారని ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ పై విధంగా స్పందించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.